తగ్గుతోంది వడ్డీ..ప్రత్యామ్నాయం ఏదీ?


రోజురోజుకూ.. అటు బ్యాంకు పొదుపు ఖాతాలపైనా.. ఇటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అతి పెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పొదుపు ఖాతాలపై అందించే వడ్డీని 4శాతం నుంచి 3.5శాతం చేసింది. యాక్సిస్‌ బ్యాంకు కూడా ఇదే వడ్డీ రేటులోకి మారింది. కొంతకాలం ఆగితే మరిన్ని బ్యాంకులు ఇదే మార్గాన్ని అనుసరిస్తాయనడంలో సందేహం లేదు. ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గత ఏడాది కాలంగా తగ్గుతూనే ఉన్నాయి. మరి, ఇలాంటప్పుడు ఏం చేయాలి? అధిక వడ్డీ కోసం ప్రత్యామ్నాయ మార్గాలేమున్నాయి?
డ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు డెట్‌ ఫండ్ల గురించి చాలామంది చర్చించుకుంటున్నారు. నిజానికి వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ఇవి కొంత మంచి ఫలితాలనే అందిస్తుంటాయి. అయితే, వీటిని అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు. వీటిలో ఉన్న రకరకాల పథకాల్లో.. ఏ అవసరానికి ఏది సరిపోతుందో ఎంచుకోవడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. డెట్‌ ఫండ్లను ఎంచుకునేప్పుడు మన లక్ష్యం ఏమిటి? వ్యవధి ఎంత? వాటికి ఏ తరహా పథకాలు సరిపోతాయనేది తెలుసుకోవాలి.
1 రోజు నుంచి 90 రోజుల్లోపు..
స్వల్పకాలానికి పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు లిక్విడ్‌ మ్యూచువల్‌ ఫండ్లు నప్పుతాయి. వీటిని బ్యాంకు పొదుపు ఖాతాలకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. చాలామంది అత్యవసర అవసరాల కోసం.. పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు ఖాతాలో జమ చేస్తుంటారు. ఇలాంటప్పుడు లిక్విడ్‌ ఫండ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి బ్యాంకు పొదుపు ఖాతాకన్నా కాస్త అధికంగానే రాబడినిస్తాయి. ప్రస్తుతం చాలా లిక్విడ్‌ ఫండ్లు సగటున 6శాతం వరకూ రాబడినిస్తున్నాయి. కింద పట్టికను గమనించండి.
 
ప్రస్తుతం కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు లిక్విడ్‌ ఫండ్ల నుంచి వెంటనే నగదును వెనక్కి తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. రూ.50వేల వరకూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకునే అవకాశాన్నిస్తున్నాయి.
90- 270 రోజులకు..
మూడు నెలలకు మించి పెట్టుబడిని కొనసాగించాలనుకునే వారు అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ఈ ఫండ్లలో పెట్టుబడులను ఎక్కువగా 90 రోజుల నుంచి ఏడాది వ్యవధి వరకూ ఉండే డెట్‌ సెక్యూరిటీల్లో మదుపు చేస్తుంటారు. కాబట్టి, లిక్విడ్‌ పండ్లతో పోలిస్తే ఇవి కాస్త అధిక రాబడిని అందిస్తాయి. చాలామటుకు ఫండ్లు పెట్టుబడి ఉపసంహరణకు సంబంధించి అమ్మకపు రుసుమును విధించడం లేదు. అయినప్పటికీ.. 90 రోజులకు మించి వ్యవధి ఉన్నప్పుడే ఈ తరహా ఫండ్లను ఎంచుకోవడం ఉత్తమం.
రెండున్నర ఏళ్ల వరకూ..
ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు.. రెండున్నర ఏళ్లదాకా ఆగగలం అనుకున్నప్పుడు షార్ట్‌ టర్మ్‌ ఫండ్లు సరిపోతాయి. సమీకరించిన పెట్టుబడి మొత్తాలను ఫండ్‌ నిర్వాహకులు డిపాజిట్‌ సర్టిఫికెట్లు, కమర్షియల్‌ పేపర్లు, నాన్‌ కన్వెర్టిబుల్‌ డిబెంచర్లు, స్వల్పకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలు తదితర వాటిల్లో మదుపు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏడాది నుంచి రెండున్నర ఏళ్ల వ్యవధితోనే ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యవధికి సంబంధించినవి కాబట్టి, అల్ట్రాషార్ట్‌ టర్మ్‌ ఫండ్లకన్నా కాస్త అధిక రాబడినిస్తాయి. అయితే, వీటిలో మదుపు చేసేప్పుడు తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న పథకాల్లో మదుపు చేసే వాటిని నివారించాలి.
మూడేళ్లకు మించి...
పెట్టుబడిని మూడేళ్లకు మించి కొనసాగించే ఆలోచన ఉన్నప్పుడు ఆ మొత్తాన్ని ఫిక్సెడ్‌ డిపాజిట్లలో జమ చేయడం కన్నా.. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం గురించి ఆలోచించవచ్చు. ఎఫ్‌డీలతో పోలిస్తే వీటిలో పన్ను పరమైన ప్రయోజనాలూ ఉంటాయి. దీన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఇలా పరిశీలిద్దాం!
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: మీరు రూ.5లక్షలను మూడేళ్ల కాల వ్యవధికి 7శాతం రాబడి వచ్చేలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారనుకుందాం. అప్పుడు వ్యవధి తీరాక మీ చేతికి రూ.6,12,521 వస్తాయి. మీరు 30శాతం పన్ను శ్లాబులో ఉంటే.. మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.33,756. పన్ను మొత్తం పోను మీకు మిగిలేది రూ.5,78,765. అంటే, మీకు వచ్చే 5శాతమే.
డెట్‌ ఫండ్లలో మదుపు చేస్తే: చాలా సందర్భాల్లో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకన్నా అధిక రాబడినే అందిస్తాయి. కానీ, పోల్చుకునేందుకు వీలుగా వీటి రాబడి 7శాతమే అనుకుందాం..
రూ.5లక్షలను డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేశారనుకుందాం. ఇందులో 7శాతం వార్షిక సగటు రాబడి వస్తుందనుకుందాం. ఇక్కడ కూడా మూడేళ్ల తర్వాత రూ.6,12,521 వస్తుంది. మూడేళ్లకు మించి డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు ‘లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ టాక్సేషన్‌’ కిందకు వస్తాయి. ద్రవ్యోల్బణ సూచీ 6శాతం ఉందనుకుంటే.. దీనికి సర్దుబాటు చేసిన తర్వాత రూ.5లక్షల విలువ రూ.5,95,508తో సమానం అవుతుంది. అంటే, అధికంగా వచ్చిన మొత్తం రూ.17,013. ఈ మొత్తంపై 20శాతం పన్ను విధిస్తారు. అంటే.. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ.3,402. అంటే, పన్ను పోను అసలు, వడ్డీ కలిపి మీ చేతికి రూ.6,09,118 వస్తాయి. అంటే మీకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకన్నా అధికంగా వచ్చే మొత్తం రూ.30,353. (గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే)
రకాలెన్నో... 
మూడేళ్లకు మించి డెట్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకున్నప్పుడు అందులో ఏ రకంలో పెట్టుబడి పెట్టాలన్నది ఎంచుకోవడమూ కీలకమే. ఇందులో ఉన్న రకాలను ఒకసారి గమనిస్తే..
అక్రూరల్‌ ఫండ్లు: వడ్డీ రేట్ల చలనంతో సబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెట్టుబడి పెట్టేందుకు ఈ తరహా ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇందులో కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్లు, క్రెడిట్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్లు అందుబాటులో ఉంటాయి. ఫండ్‌ మేనేజర్‌ పరిస్థితుల ఆధారంగా.. పెట్టుబడులను మారుస్తూ ఉంటారు.
ఇన్‌కం ఫండ్లు: వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు బాండ్ల ధరలు పెరుగుతుంటాయి. వడ్డీ రేట్లు పెరుగుతుంటే బాండ్ల ధరలు తగ్గుతుంటాయి. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని, వడ్డీ రేట్లు తగ్గుతున్న దశలో ప్రయోజనాన్ని పొందేందుకు ఫండ్‌ మేనేజర్‌ ప్రయత్నిస్తారు.
డైనమిక్‌ బాండ్‌ ఫండ్‌: డైనమిక్‌ బాండ్‌ ఫండ్ల పనితీరు ఇన్‌కం ఫండ్లను పోలి ఉంటుంది. ఫండ్‌ మేనేజర్లు తగ్గుతున్న వడ్డీ రేట్ల నుంచి ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నిస్తూ పెట్టుబడుల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. వడ్డీ రేట్ల కదలికలను బట్టి, పెట్టుబడులను ఆయా బాండ్లలో తగ్గించడం, పెంచడంలాంటివి చేస్తుంటారు. ఈ తరహా ఫండ్లు తగ్గుతున్న వడ్డీ రేట్ల నుంచి ప్రయోజనాన్ని పొందాలనుకుని, డెట్‌ మార్కెట్‌ను సరిగా అంచనా వేయలేం అనుకునే వారు ఈ తరహా పథకాలను ఎంచుకోవడం ఉత్తమం.
మంత్లీ ఇన్‌కం ప్లాన్‌: ఈ పథకాల్లో ఫండ్‌ మేనేజర్‌ 75-80శాతం వరకూ పెట్టుబడులను డెట్‌ పథకాల్లోనూ.. మిగతా 20-25% వరకూ మొత్తాన్ని ఈక్విటీల్లోనూ మదుపు చేస్తుంటారు. పెట్టుబడి మొత్తం కాస్త సురక్షితంగా ఉంటూ.. ఈక్విటీ లాభాలు కూడా అందుకోవాలని భావించే వారికి ఇవి నప్పుతాయని చెప్పొచ్చు. ఉదాహరణకు మీరు రూ.100 ఈ పథకంలో మదుపు చేశారనుకుందాం.. అప్పుడు రూ.80ని డెట్‌ సెక్యూరిటీల్లోనూ.. రూ.20ని ఈక్విటీల్లోనూ మదుపు చేస్తారు. మూడేళ్లకాలంలో డెట్‌ పథకంలో 8శాతం సగటు రాబడి వచ్చిందనుకుంటే.. మీరు పెట్టిన పెట్టుబడి మూడేళ్ల తర్వాత రూ.80 కాస్తా రూ.100 అవుతుంది. ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడి రూ.20తో కలిపి ఇది రూ.120 అవుతుంది. ఈక్విటీ మార్కెట్లు బాగుంటే.. మీరు మదుపు చేసిన రూ.20కూడా మంచి లాభాలను గడిస్తుంది. ఒకవేళ మార్కెట్‌ బాగాలేక మీరు పెట్టిన రూ.20 సున్నా అయినా.. మీ పెట్టుబడి మొత్తం అలాగే ఉంటుంది.
ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు: ఈ తరహా ఫండ్లలో 100 శాతం పెట్టుబడులూ రుణ ఆధారిత పథకాల్లోనే ఉంటాయి. వీటి నుంచి వచ్చే రాబడి స్థిరంగా ఉండేలా చూసుకుంటూ ఫండ్‌ మేనేజర్లు పెట్టుబడులను కేటాయిస్తుంటారు. వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు వీటిలో మదుపు చేసేందుకు మంచి సమయం. తర్వాత వడ్డీ రేట్లు తగ్గినా ఆ ప్రభావం మీ పెట్టుబడులపై ఉండదు.
డ్యూయల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు: వీటిలో పెట్టుబడి పెట్టినప్పుడు నిర్ణీత వ్యవధి తర్వాత మాత్రమే దానిని వెనక్కి తీసుకునే వీలుంటుంది. వీటి పెట్టుబడుల కేటాయింపు కూడా మంత్లీ ఇన్‌కం ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఫండ్‌ మేనేజర్లు అధిక మొత్తంలో ఈక్విటీ డెరివేటివ్స్‌కు కేటాయించి, అధిక లాభాల కోసం ప్రయత్నిస్తారు.
గిల్ట్‌ ఫండ్లు: ఈ తరహా ఫండ్లు తమ పెట్టుబడులను కేవలం ప్రభుత్వ హామీ ఉన్న పథకాల్లోనే మదుపు చేస్తాయి. అందువల్ల ఈ ఫండ్లలో నష్టభయం దాదాపు ఉండదనే చెప్పుకోవచ్చు. అయితే, ఈ ప్రభుత్వ సెక్యూరిటీలు దీర్ఘకాలానికి సంబంధించినవై ఉంటాయి. రాబడి విషయంలో ఇన్‌కం ఫండ్లలో ఉండే వడ్డీ రేట్ల నష్టభయం ఇందులోనూ కనిపిస్తుంటుంది.

Comments

Popular posts from this blog

శ్రీరస్తు - శుభమస్తు - కళ్యాణమస్తు

శ్రీరస్తు - శుభమస్తు - కళ్యాణమస్తు